WELCOME TO SRI SRINIVASA KALYANAM
 
 
Gold Sponsors
 
Home
Chief Guest
Srinivasa Kalyanam Activities
Trust
Sponsors
Donations
Payments
Volunteers help
English
Contact Us
Telugu
Design Gallery
Premium Sponsors
Gold Sponsors
Latest News
Other News
Web Page Feeds
 
 
 
శ్రీ పద్మావతీ శ్రీనివాస కళ్యాణం.

ఓం శ్రీ వేంకటేశాయ నమో నమః.


శ్రీ పద్మావతీ శ్రీనివాస కళ్యాణం.
శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయే2ర్ధినామ్ !
శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ !!


కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడు కొలువై యున్న వేంకటాచలము ఒక మహత్తర శక్తి భరిత దివ్య క్షేత్రము. సృష్ట్యారంభం నుంచి ఉన్న తిరుమలనే, వేంకటాచలము, గరుడాచలము, నీలాద్రి, శేషాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, అంజనాద్రి అనే సప్త నామాలతో పిలుస్తారు. శ్రీవేంకటాచలం మీద ఈశ్వరునిలా విలసిల్లుతున్నాడు కనుక శ్రీవేంకటేశ్వరస్వామి అంటారు.


"వేంకటేశ సమం స్థానం బ్రహ్మాండే నా2స్తి కశ్చన !
వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి" !!
అని బ్రహ్మాండ పురాణం చెప్తోంది.


సృష్ట్యాదిలో శ్రీమన్నారాయణుని సంకల్పం వల్ల ఆయన నాభికమలంలో నుంచి వచ్చిన బ్రహ్మదేవుడు సృష్టికార్యం ప్రారంభించి, చతుర్దశ భువనాలను బ్రహ్మాండాలను, దేవగణాలను సృష్టి చేసి, స్వాయంభువ మనువు, శతరూపాదేవి అనే దంపతులను సృష్టించి, సృష్టి విస్తరణ బాధ్యతను మనువుకు అప్పగించాడు. మనువు సృష్టి చేద్దామని చూశాడు. కానీ భూమి కనపడలేదు. హిరణ్యాక్షుడనే రాక్షసుడు భూమిని సముద్ర గర్భంలో దాచేశాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు యజ్ఞ వరాహ స్వామి రూపంలో అవతరించి, హిరణ్యాక్షుని వధించి, భూమిని ఉద్ధరించాడు.


ఇది శ్రీమన్నారాయణుని ప్రథమావతారం. శ్వేతవరాహంగా స్వామి అవతరించి భూమిని ఉద్ధరించాడు కనుక ఇది శ్వేతవరాహ కల్పమయింది. ఆయన అవతరించిన దివ్య క్షేత్రం శ్రీఆది వరాహక్షేత్రం. అదే తిరుమల. ఆదిశేషుడు శేషాచలంగా మారగా, చతుర్ముఖ బ్రహ్మాది సకల దేవతల ప్రార్ధనలతో, వారి కోరిక మేరకు శ్రీమహాలక్ష్మీదేవిని అన్వేషిస్తూ, శ్రీనివాసునిగా భువికి వచ్చిన స్వామి ఈ పర్వతం మీదే శ్రీవేంకటేశ్వరునిగా వెలిశాడు. సాక్షాత్తుగా పరమాత్మను శ్రీకృష్ణునిగా లాలించి, పెంచి, అతని బాల్య లీలలతో ఆనందించిన యశోదమాత 'కన్నయ్యా ! నీ కళ్యాణం చూసే భాగ్యం నాకు లేదా' ? అని అడిగినందుకు, ఆవిడను వకుళమాతగా జన్మించేలా అనుగ్రహించి, ఆవిడ చేతుల మీదుగా పద్మావతీ దేవితో కళ్యాణం జరిపించుకుని, తాను అవతారం చాలించేటప్పుడు తన తేజస్సును వేంకటాచలం మీదే విగ్రహ రూపంలో వదిలేసి వైకుంఠానికి వెళ్ళాడు. కనుకే తిరుమలలో సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే అర్చామూర్తిగా స్థిరంగా నిలిచి ఉన్నాడు. సర్వ మానవాళినీ అనుగ్రహించటానికి వచ్చిన అర్చావతారం శ్రీవేంకటేశ్వరస్వామి అవతారం. వేం అంటే పాపాలను కట అంటే నశింపజేసేవాడు అని అర్ధం.

ఈ కల్ప ప్రారంభంలో కశ్యప ప్రజాపతి లోక కళ్యాణం కోసం ఒక యజ్ఞం నిర్వహిస్తున్నప్పుడు, ఆ యజ్ఞ ఫలాన్ని స్వీకరించగలిగిన అర్హత త్రిమూర్తులలో ఎవరికుంది ? అని చర్చ వచ్చింది. ఎవరు శుద్ధ సత్వగుణ సంపన్నులో నిర్ణయించమని భృగుమహర్షిని అడిగారు. భృగుమహర్షి సరేనని బయలుదేరి సత్యలోకానికి వెళ్తాడు. అక్కడ బ్రహ్మదేవుడు సరస్వతీ దేవి వీణాగానం వింటూ మై మరచి భృగుమహర్షి రాకను గమనించడు. ఆయన పిలిచినా వినిపించుకోడు. భృగుమహర్షి కైలాసానికి వెళ్తాడు. ఆ సమయంలో మహాదేవుడు పార్వతీదేవితో కలిసి ఆనంద తాండవ నాట్యం చేస్తూ మహర్షి రాకను గమనించడు. భృగుమహర్షి వైకుంఠానికి వెళతాడు. అక్కడికి వెళ్ళేప్పటికి శ్రీ మహాలక్ష్మీదేవి అర్ధనిమీలిత నేత్రుడై ఉన్న శ్రీ మన్నారాయణుని పాదాలొత్తుతూ ఉంటుంది. మహర్షి రాకను వారు గమనించరు. భృగుమహర్షికి కోపమొచ్చి బ్రహ్మర్షులమైన మా రాకనే గమనించవా ? అంటూ వేగంగా వెళ్ళి, శేషశాయి అయిన శ్రీ హరి వక్షఃస్థలం పైన పాదంతో తన్నాడు. వెంటనే శ్రీమన్నారాయణుడు, యావద్విశ్వానికీ అభయమిచ్చి రక్షించే తన కరకమలాలతో మహర్షి పాదాలను పట్టుకుని, అతి కఠినమైన నా వక్షఃస్థలం తగిలి మీ సుతిమెత్తని పాదాలు ఎంత కందిపోయాయో అంటూ నెమ్మదిగా ఆయన అరికాలిలో ఉన్న అహంకారమనే కన్నును చిదిమేశాడు. దాంతో, త్రిమూర్తులనే పరీక్షిస్తున్న నేను వారి కంటే గొప్ప వాడిని అనే భావన వల్ల కలిగిన అహంకారం నశించగానే, పరమాత్మ తన పాదాలు పట్టుకున్నాడని ఎంతో బాధపడి, పశ్చాత్తాపపడి, శ్రీ హరి కాళ్ళ మీద పడి ప్రార్ధిస్తాడు. భూలోకానికి తిరిగి వచ్చి త్రిమూర్తులలో శుద్ధ సత్త్వగుణ సంపన్నుడు శ్రీ హరేననీ, యజ్ఞఫలం స్వీకరించటానికి ఆయనే అర్హుడనీ తీర్మానించి చెప్తాడు.

శ్రీ మహాలక్ష్మీదేవికి తన నివాస స్థానమైన శ్రీ హరి వక్షఃస్థలాన్ని భృగుమహర్షి పాదంతో తన్ని అవమానించి నందుకు కోపం తెచ్చుకుని వైకుంఠం వదిలేసి, భూలోకం వచ్చి, కొల్హాపూర్ లో తపస్సు చేస్తూ ఉండిపోయింది. లక్ష్మీదేవి వెళ్ళిపోయేటప్పటికి లక్ష్మీ కళ హరించిపోయిన శ్రీ హరి శ్రీ మహాలక్ష్మీదేవిని వెతుకుతూ భూలోకానికి వచ్చి, ఇప్పుడు మనం తిరుమల అని పిలుస్తున్న పర్వత అటవీ ప్రాంతానికి వచ్చి, ఒక పుట్టలో ఉండసాగాడు. పార్వతీదేవి ఒక గొల్ల వనితలా మారి, బ్రహ్మ దేవుని ఆవుగా, పరమేశ్వరుని దూడగా చేసి చోళరాజు దగ్గరికి వెళ్ళి, ఆ ఆవును దూడను ఆ రాజుకు అమ్మింది. ఆవు దూడలను రాజుగారి గోశాలకు పంపించారు. పశువుల కాపరి గోవులను మేపటానికి అడవికి తీసుకెళ్ళినప్పుడు ఈ ఆవు, విష్ణుమూర్తి శ్రీనివాసునిగా వచ్చి ఉన్న పుట్ట దగ్గరికి వెళ్ళి, తన పాలను అక్కడ కురిపించి, స్వామి ఆకలి తీర్చేది. ఈ ఆవు పాలను ఇవ్వటం లేదని గమనించి పశువుల కాపరి రాజుకు చెప్పాడు, తాను ఆ ఆవును గమనించ సాగాడు. ఆవు శ్రీనివాసుడున్న పుట్ట దగ్గరికి వెళ్ళి తన పాలను అక్కడ కురిపించటం గమనించి, అవును కొట్టడానికి గొడ్డలి విసురుతాడు. ఆవు తప్పుకుంటుంది. అది పుట్టలో ఉన్న శ్రీనివాసుని గడ్డానికి తగిలి రక్తం కారుతుంది. పశువుల కాపరి మరణిస్తాడు. రక్తపు మరకలతో వచ్చిన ఆవును చూసి, రాజు ఆ స్థలానికి వెళ్ళి, అక్కడ తవ్వించాలనుకుంటాడు. కానీ 'రాజా ! నీ సేవకులు చేసిన దుశ్చర్యకు గాను నువ్వు బ్రహ్మ రాక్షసుడివి అవుతావు. నా కళ్యాణం జరిగిన అనంతరం నీ యథా రూపం నీకు వస్తుంది' అని వినిపిస్తుంది.

శ్రీ నివాసుడు కలియుగాంతం వరకూ భూమి మీద నివసించటానికి స్థలమివ్వమని శ్రీ వరాహ స్వామిని అడుగుతాడు. వరాహ స్వామి అంగీకరించి, దానికి ప్రతిగా, భక్తులు ముందు తనను దర్శించాకే శ్రీనివాసుని దర్శించాలని షరతు విధిస్తాడు. శ్రీనివాసుడు అంగీకరిస్తాడు.

నివాసుని సేవించటానికి శ్రీ వరాహ స్వామి వకుళమాతను పంపుతాడు. ఆమెయే పూర్వ జన్మలో యశోదామాత. శ్రీ కృష్ణుని పరిణయం చూడాలని పరితపించిన తల్లి.

ఆ కాలంలో తొండమండలానికి రాజు ఆకాశరాజు. సంతానం లేని ఆ రాజు పిల్లల
కోసం యాగం చెయ్యాలని పొలం దున్నుతుండగా, అక్కడ బంగారు పద్మంలో ఒక అందాల పాప కనిపిస్తుంది. పద్మంలో దొరికింది కనుక పద్మావతి అని పేరు పెట్టి, ఆకాశరాజు, ధరణీదేవి దంపతులు ఆ పాపను అల్లారు ముద్దుగా పెంచుతుంటారు. పద్మావతి పెరిగి పెద్దదవుతుంది. ఒక రోజు నారదమహర్షి వారింటికి వచ్చి, పద్మావతితో శ్రీ మహావిష్ణువు నీకు భర్తవుతాడని చెప్తాడు.

శ్రీనివాసుడు వేటకు వెళ్ళి ఒక ఏనుగును వేటాడబోగా, అది పద్మావతీదేవి విహరిస్తున్న దిశగా వస్తుంది. శ్రీనివాసుడు, పద్మావతీదేవి పరస్పరం చూసుకుంటారు. పద్మావతి చెలికత్తెలతో అతనెవరో కనుక్కోమంటుంది. ఆయన తన పేరు శ్రీనిసుడనీ, తాను పద్మావతిని పరిణయ మాడతాననీ చెప్తాడు. పద్మావతీదేవి చెలికత్తెలతో వెళ్ళి పోతుంది. ఇంటికి వచ్చిన శ్రీనివాసుడు దిగులుగా ఉండటం చూసి, వకుళమాత కారణమడుగుతుంది. శ్రీనివాసుడు పద్మావతీదేవి గురించి చెప్పి, తనకు ఆమెతో వివాహం జరిపించమని తల్లిని కోరతాడు. ఆమెను తాను పరిణయమాడటానికి గల కారణాన్ని వివరిస్తాడు.
త్రేతాయుగంలో తపస్సు చేస్తున్న వేదవతిని చూసి, రావణాసురుడు మోహించగా, నీ మరణానికి నేనే కారకురాలిని అవుతానని చెప్పి, ఆమె అగ్ని ప్రవేశం చేసింది. అగ్నిహోత్రుడు తండ్రిలా ఆమెను తన సంరక్షణలో ఉంచుకున్నాడు. రావణుడు సీతమ్మను అపహరించటానికి వచ్చినప్పుడు అగ్ని దేవుడు సీతమ్మను సురక్షితంగా దాచి, సీతమ్మ స్థానంలో వేదవతిని ఉంచుతాడు. రావణుడు వేదవతిని సీత అనుకుని తీసుకు వెళతాడు. రావణ వధానంతరం సీతమ్మ అగ్ని ప్రవేశం చేసినప్పుడు నిజమైన సీతమ్మను శ్రీరామునికి అప్పగిస్తాడు. అప్పుడు వేదవతి కోరిక ప్రకారం ఆమెను కలియుగంలో వివాహం చేసుకుంటానని శ్రీరామచంద్రుడు సీతమ్మకు చెప్తాడు.

వకుళమాత ఎరుకలసానిగా నారాయణపురం వెళ్ళి, ఆకాశరాజును కలిసి, పద్మావతీ శ్రీనివాసుల కల్యాణం జరుగుతుందని చెప్తుంది. ఆకాశరాజు బృహస్పతిని సలహా అడుగగా వారిరువురి కళ్యాణం జరిపించమని చెప్తాడు. వకుళాదేవి శ్రీనివాసునితో కలిసి ఆకాశరాజు దగ్గరికి వచ్చి, పద్మావతీదేవిని కోడలుగా ఇమ్మని అడుగుతుంది. ఆకాశరాజు సంతోషంగా అంగీకరిస్తాడు. తన పెళ్ళి ఖర్చు కోసం శ్రీనివాసుడు కుబేరుని వద్ద అప్పు తీసుకుంటాడు. ఆ అప్పును కలియుగాంతం వరకూ తీరుస్తూ ఉంటానని చెప్తాడు. ఇలా అప్పు తీసుకున్నందుకు సాక్షిగా ఉన్న గోవింద వరదరాజ స్వామి వారి వద్ద ఋణపత్రము, వడ్డీని కొలిచే సోలను ఇప్పటికీ మనం చూడవచ్చును. త్రిమూర్తుల, సమస్త దేవతల, ఋషుల సమక్షంలో పద్మావతీ శ్రీనివాసుల కల్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది.

ఆకాశరాజు సూర్య భగవానుడు. సూర్య కిరణాలతో విచ్చుకునేది పద్మము. పద్మమును వికసనకు, సౌకుమార్యానికి, సౌందర్యానికి, సువాసనకు చెప్తాము. భూమిలోని సర్వ జీవజాలము ప్రాణవంతమయేది సూర్యుని వలననే ! అది ఆయన కుమార్తె పద్మావతీదేవిగా చెప్పబడింది. భూమిలోని సకల సంపదలు లక్ష్మీదేవివే ! ఆమెయే పద్మావతి. ఆమె శ్రీమన్నారాయణుని భార్య. ఆమె శ్రీమన్నారాయణునికి అనపాయిని. శ్రీమన్నారాయణుడు అంటే ధర్మము. అంటే, ఎవరు ధర్మాత్ములో, వారిని ఐశ్వర్యం వరిస్తుంది, వారు ఆరోగ్యవంతులు, దీర్ఘాయుష్మంతులు అవుతారు.

తిరుమలలో శ్రీనివాస కళ్యాణం ప్రతి రోజు జరుగుతుంది. తిరుమల మొత్తం నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా వెలుగొందుతూ ఉంటుంది.

కళ్యాణం అంటే శుభము, మంగళము. 'కళ్యాణము' అనే పదానికి 'మేలు కలిగించటము' అని అర్ధము. కళ్యాణము అంటే వివాహము అనే అర్ధంలో కూడా వాడతాము. పెద్దలు పిల్లలను 'కళ్యాణమస్తు' అని ఆశీర్వదిస్తారు. అంటే శుభం కలగాలని ఆశీర్వదించడం. పెద్దలు పెళ్ళీడు కొచ్చిన వారిని 'శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు' అని దీవిస్తారు. అంటే, త్వరలో పెళ్ళి జరిగి, పెళ్ళి వలన శుభం కలగాలని ఆశీర్వదించడ మన్నమాట !

లోక కళ్యాణం కోసం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం భగవంతుడు అవతరిస్తాడు. దైవానికి కళ్యాణం జరిపిస్తే, లోకానికి కళ్యాణం జరుగుతుంది. పాపాలు నశిస్తాయి. శుభము, శాంతి, సుఖము, సంపద లభిస్తాయి.

ప్రతి ఏట చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీ సీతారామ కళ్యాణం చేస్తాము. శివరాత్రి మరునాడు శివపార్వతుల కళ్యాణం చేస్తాము. శ్రవణ నక్షత్రం రోజున శ్రీనివాస కళ్యాణం చేస్తాము. కానీ ఎప్పుడు కావాలన్నా, దేవతల కళ్యాణం జరిపించ వచ్చును. దైవ కల్యాణం ఎంత ఎక్కువ మంది ఎన్ని ఎక్కువ సార్లు చేస్తే, లోకానికి అంత ఎక్కువ కళ్యాణం జరుగుతుంది. ఎందుకంటే, యావద్విశ్వానికీ మూలము పరమాత్మ. ఈ విశ్వమే పరమాత్మ. 'సర్వం ఖల్విదం బ్రహ్మ. '
"వృక్షస్య మూల సేచనాత్ వృక్షో భవతి సించితః". చెట్టు మొదట్లో నీళ్ళు పోస్తే, చెట్టంతటికీ నీళ్ళు అందుతాయి. చెట్టు పుష్పిస్తుంది, ఫలిస్తుంది. అలాగే ప్రపంచానికి మూలమైన పరమాత్మకు కల్యాణం చేస్తే, ఆ ఫలితం పరమాత్మ స్వరూపమైన ప్రపంచానికి లభిస్తుంది. మానవులందరూ, సర్వ ప్రాణికోటి శుభములను పొంది ఆనందంతో వర్ధిల్లుతారు.

వివాహం వల్ల విడివిడిగా ఉన్న స్త్రీ పురుషులు ఏకమై ఒక్కరుగా భాసించి, ఒక్కరైన ఆ జంట సత్సంతానాన్ని పొంది సృష్టిని విస్తరింప చెయ్యటమే కళ్యాణం యొక్క పరమార్ధం. ప్రకృతి పరమాత్మలు రెండుగా కనిపిస్తున్నా, ప్రకృతి అంతా అంతర్లీనంగా ఉండి నడిపిస్తున్న పరబ్రహ్మ శక్తి, ప్రకృతి, రెండు ఒక్కటేనని చెప్పటమే కళ్యాణం యొక్క అంతరార్ధం.

నిర్గుణ, నిరాకార, నిరంజనమైన పరమాత్మ భక్తుల కోసం సగుణ సాకార రూపంలో అవతరిస్తాడు.

"చిన్మయస్యాద్వితీయస్య నిష్కళస్యాశరీరిణః !
ఉపాసకానాం కార్యార్ధం బ్రహ్మణో రూప కల్పనా" !!

ఈ శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ పరమాత్మ ఇచ్చినవే ! పరమాత్మ శక్తి వల్లే ఇవన్నీ శక్తి వంతమయ్యాయి. కనుక వీటితో పరమాత్మను అర్చించి కృతజ్ఞత తెలియ పరచాలి. పరమాత్మ సేవ చెయ్యాలి. నోటితో పరమాత్మ గుణగానం చెయ్యాలి, కీర్తించాలి. చేతులతో పూజించాలి, చెవులతో భగవత్కథలు వినాలి, కన్నులతో భగవద్రూపాన్నే చూడాలి, మనస్సుతో భగవంతుని ధ్యానం చెయ్యాలి.
శ్రీమన్నారాయణుని అవతారాలన్నీ ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం వచ్చి, ఆ ప్రయోజనం సిద్ధించగానే అవతారం చాలించి వెళ్ళిపోయినవే ! కానీ శ్రీమన్నారాయణుడు శ్రీ వేంకటేశ్వర స్వామిగా వచ్చినది మటుకు ఒక రాక్షసుని సంహరించే ప్రత్యేక ప్రయోజనం కోసం కాదు, కలియుగాంతం వరకూ ప్రజలందరినీ అనుగ్రహించటానికి వచ్చిన అర్చామూర్తి. కనుక కల్యాణ వేంకటేశ్వర స్వామి కి నిత్య కళ్యాణోత్సవములు జరిపిస్తున్నారు తిరుమలలో !

ఉత్సవము అంటే పరమాత్మ పైనుంచి క్రిందకి దిగి రావటం. అలా పరమాత్మ క్రిందికి దిగి వచ్చినప్పుడు జీవులు ఉత్ అంటే పైకి ఆధ్యాత్మిక ప్రగతిని పొందటానికి చేసే ప్రయత్నము ఉత్సవము. తిరుమల దివ్య క్షేత్రంలో ప్రతిరోజు వందలాది మంది శ్రీవారికి కళ్యాణోత్సవం జరిపించుకుంటూ ఉంటారు. సాధారణంగా వివాహ మవగానే నూతన వధూవరులను తిరుమల తీసుకుని వెళ్ళి, శ్రీనివాసునికి కళ్యాణం చేయించటం ఆనవాయితీగా వస్తోంది. ఎందుకంటే, పవిత్రమైన దివ్య క్షేత్రంలో భగవత్కళ్యాణం జరిపించుకుంటే, జీవితమంతా కల్యాణ ప్రదంగా, ప్రశాంతంగా సాగుతుందని అందరికీ నమ్మకం.

తిరుమలలో కల్యాణోత్సవం నిర్వహించటానికి ఒక కారణం ఉంది. పూర్వం శ్రీమలయప్ప స్వామి వారికి విశేష పర్వదినాలలోను, బ్రహ్మోత్సవాల సమయంలో మాత్రమే కళ్యాణం జరిగేది. కానీ
తొండమాన్ చక్రవర్తి తిరుమలేశునికి నిత్య కళ్యాణోత్సవం ప్రారంభించారు. చాలా కాలం అది కొనసాగింది. మధ్యలో కొన్నాళ్ళు ఆగిపోతే, శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు దానిని పునరుద్ధరించారు. అప్పటి నుంచి తిరుమలలో ఆర్జిత సేవల్లో భాగంగా నిత్య కళ్యాణోత్సవము నిరాఘాటంగా నేటికీ కొనసాగుతోంది. తద్వారా జగత్కళ్యాణ చక్రవర్తి అయిన శ్రీనివాసుని సంపూర్ణ అనుగ్రహం పొందటానికి భక్తులకు వీలవుతున్నది. తిరుమలలో అన్ని సేవలలోకీ ఈ కళ్యాణోత్సవంలోనే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. పద్మావతీ శ్రీనివాసుల కళ్యాణం నిర్వహిస్తున్న వారు, తిలకిస్తున్న వారు కూడా ఆనంద పరవశులై, తన్మయులై ధన్యులవుతారు. వైఖానస ఆగమ పద్ధతిలో జరిగే స్వామివారి పూజలు, కళ్యాణము, కళ్యాణములో ప్రవరలు చెప్పటము, జీలకర్ర బెల్లం పెట్టటము, మంగళ సూత్ర ధారణ, తలంబ్రాలు, మంగళహారతులు దర్శిస్తున్న భక్తుల ఆనందానికి అవధులుండవు.

కలియుగ వైకుంఠవాసుడు శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని తిరుమలకు వెళ్ళి దర్శించ లేని లక్షలాది మంది భక్తులు సులభంగా వచ్చి కన్నుల పండుగగా కళ్యాణోత్సవాన్ని తిలకించటానికి వీలుగా శ్రీ శ్రీనివాస కళ్యాణం ట్రష్ట్ మరియు శ్రీ దత్తగిరి మహరాజ్ ఛారిటబుల్ ట్రష్ట్ వారు సంయుక్తంగా
*28.10.2018.* న హైదరాబాదులోని లాల్ బహదూర్ స్టేడియంలో శ్రీ పద్మావతీ వేంకటేశ్వర స్వామి వారల కళ్యాణ మహోత్సవమును జరిపించుటకు సంకల్పించారు. కనుక భక్త మహాశయులందరు వచ్చి శ్రీ పద్మావతీ శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవమును దర్శించి తరించ గలరు.

కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్ధ ప్రదాయినే !
శ్రీమద్వేంకట నాథాయ సార్వభౌమాయ మంగళం !!

సర్వం శ్రీ పద్మావతీ శ్రీనివాస చరణారవిందార్పణమస్తు.


డా.టి.(ఎస్)విశాలాక్షి.

 
Silver Sponsors
 
Contact Us
Sri Srinivas Kalyanam Trust , Flat No. : 502, Paigah Plaza, 5-9-30/5,Near Liberty Cross Roads, Basheerbagh, Hyderabad - 500 063.
Phone No : 99636 77777, 040-66663446; Email: srisrinivasakalyanamtrust@gmail.com
Website: www:srisrinivasakalyanam.com
Copyright © 2017 Sri Srinivasa Kalyanam . All Rights Reserved.